‘నక్షత్రం’ ట్రైలర్ బాలేదంటే తిట్టాడట

0
472
Sandeep Kishan about Nakshatram Movie
Sandeep Kishan about Nakshatram Movie

అసలే వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న సందీప్ కిషన్ కు ‘నక్షత్రం’ సినిమా పెద్ద బ్రేకే వేసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని తపించే హీరోల్లో ఒకడిగా సందీప్ కూడా ఆయనతో పని చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఎగ్జైట్ అయ్యాడు. కాకపోతే ఈ అవకాశం రాంగ్ టైమింగ్ లో వచ్చింది. పూర్తిగా ఫామ్ కోల్పోయి కృష్ణవంశీ పేలవమైన సినిమా తీసి సందీప్ కిషన్ కెరీర్ ను మరింత దెబ్బ తీశాడు కృష్ణవంశీ.

ఐతే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నక్షత్రం’ తేడా కొడుతుందని తనకు ముందే తెలిసిపోయినట్లుగా వ్యాఖ్యలు చేశాడు సందీప్. ఈ సినిమా ట్రైలరే తనకు నచ్చలేదని సందీప్ ఈ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఆ విషయమే కృష్ణవంశీకి చెబితే.. ఆయన తిట్టాడని సందీప్ వెల్లడించాడు. ఈ సినిమా కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చాలా ప్రమాదకర యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు సందీప్ వెల్లడించాడు.

ఇక తాను స్క్రిప్టులో ఎక్కువ జోక్యం చేసుకుంటానన్న విమర్శలపై సందీప్ స్పందిస్తూ.. మూడేళ్ల కిందటి వరకు తాను దర్శక నిర్మాతల్ని సినిమా విషయంలో అనేక ప్రశ్నలు అడిగేవాడినని.. కానీ అలా ప్రశ్నించడం మానుకున్నాకే తన కెరీర్లో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయని అన్నాడు. కెరీర్ ఆరంభంలో ఒక దర్శకుడు తనతో సినిమా తీస్తానని హైదరాబాద్ కు పిలిపించి.. నిర్మాత ఆఫీసులోనే నెల రోజులు ఉండనిచ్చి.. తర్వాత తనను పంపించేశారన్నాడు.

కట్ చేస్తే నెల రోజుల తర్వాత అదే సినిమాను వేరే హీరోతో తీశారని సందీప్ తెలిపాడు. ఆ సమయంలో తాను విపరీతంగా ఏడ్చినట్లు సందీప్ వెల్లడించాడు. తనకు తన మావయ్య ఛోటా కె.నాయుడు కంటే జెమిని కిరణ్ ఎక్కువ సాయం చేశారని ఈ ఇంటర్వ్యూలో సందీప్ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియో ఈ రోజు రాత్రి యూట్యూబ్ లోకి రానుంది.