చిత్రం :‘రాజా ది గ్రేట్’

నటీనటులు: రవితేజ – మెహ్రీన్ – రాధిక శరత్ కుమార్ – రాజేంద్ర ప్రసాద్ – శ్రీనివాసరెడ్డి – సంపత్ – ప్రకాష్ రాజ్ – సాయికుమార్ – పోసాని కృష్ణమురళి – అన్నపూర్ణ తదితరులు
ఛాయాగ్రహణం: మోహనకృష్ణ
సంగీతం: సాయికార్తీక్
నిర్మాతలు: దిల్ రాజు – శిరీష్
కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: అనిల్ రావిపూడి

ఏడాదికి రెండు మూడు సినిమాలతో పలకరించే రవితేజ.. ఆశ్చర్యకరంగా రెండేళ్ల పాటు వెండి తెర మీదే కనిపించలేదు. అతడి కెరీర్లో అనుకోని విధంగా గ్యాప్ వచ్చేసింది. ఈ విరామం తర్వాత ఇప్పుడు మాస్ రాజా ‘రాజా ది గ్రేట్’గా వచ్చాడు. పటాస్.. సుప్రీమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాజా (రవితేజ) పుట్టుకతోనే అంధుడు. కానీ రాజా తల్లి అతడికి సకల విద్యలూ నేర్పిస్తుంది. అతణ్ని కళ్లున్న వాళ్లకంటే చురుగ్గా తయారు చేస్తుంది. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసంతో ఉండే రాజాకు పోలీస్ కావాలన్నది లక్ష్యం. కానీ అంధత్వం వల్ల అది కుదరదు. ఐతే పోలీస్ ఆపరేషన్లో అయినా తన వంతు పాత్ర పోషించాలన్న పట్టుదలతో ఉున్న రాజాకు ఓ అవకాశం వస్తుంది. లక్కీ (మెహ్రీన్ కౌర్) అనే అమ్మాయిని ఓ పెద్ద గూండా నుంచి కాపాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంతకీ లక్కీ సమస్య ఏంటి.. ఆమె గతమేంటి.. ఆమెను రాజా ఎలా కాపాడాడు.. అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

తెలుగులో గత కొన్నేళ్లలో కొత్త తరహా సినిమాల హవా నడుస్తోంది. రొటీన్ కథల్ని ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాల్ని తిప్పి కొడుతున్నారు. కానీ ఇలాంటి సమయంలోనూ రొటీన్ కథలతో మెప్పించే కొందరు దర్శకులున్నారు. కథ మామూలుగా ఉన్నా.. కథనంలోనూ కొత్తదనం లేకపోయినా.. ఆ లోటు తెలియనివ్వకుండా.. ప్రేక్షకులకు వేరే ఆలోచనలు కలగకుండా ఎంటర్టైన్మెంట్ డోస్ ఇస్తూ వాళ్లను ఎంగేజ్ చేస్తారు ఈ దర్శకులు. అనిల్ రావిపూడి ఈ కోవకు చెందినవాడే. అతడి తొలి రెండు సినిమా ‘పటాస్’.. ‘సుప్రీమ్’ల్లో కథాకథనాలేమీ అంత కొత్తగా అనిపించవు. అయినా ఎంరట్టైన్ చేస్తాయి. ‘రాజా ది గ్రేట్’ కూడా ఈ కోవలోని సినిమానే. కొత్తదనం కోరుకునేవాళ్లకు కొంత నిరాశ కలిగించినా.. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లను మాత్రం ‘రాజా ది గ్రేట్’ అలరిస్తాడు.

హీరో అంధుడు అనగానే తెలుగులో ‘సిరివెన్నెల’.. ‘శ్రీను వాసంతి లక్ష్మి’ లాంటి సీరియస్.. సెంటిమెంటు నిండిన సినిమాలే గుర్తుకొస్తాయి. ఐతే హీరోను అంధుడిగా పెట్టి కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తీయొచ్చని ‘రాజా ది గ్రేట్’తో రుజువు చేశాడు అనిల్ రావిపూడి. అదే సమయంలో హీరో అంధుడు కావడం తప్ప ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. ఒక అమ్మాయి ఆపదలో ఉంటుంది. ఆమెను చంపడం కోసం ఓ విలన్ ప్రయత్నిస్తుంటాడు. పోలీసులందరూ కూడా అతణ్ని ఏమీ చేయలేకపోతుంటారు. అలాంటి స్థితిలో హీరో సేవియర్ అవతారమెత్తి ఆమెను విలన్ బారి నుంచి రక్షిస్తాడు. ఈ ఫార్మాట్లో తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు చూశాం. ‘రాజా ది గ్రేట్’ కూడా అదే ఫార్మాట్లో నడుస్తుంది. కాకపోతే అంధుడిగా హీరో విన్యాసాలు కొత్తగానే కాక.. ఎంటర్టైనింగ్ గానూ అనిపిస్తాయి.

అంధుడైన హీరో కబడ్డీ ఆడటం.. ఫైట్ చేయడం.. గున్నగున్న మామిడి లాంటి మాస్ పాటకు డ్యాన్స్ చేయడం.. ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటూనే చాలా ఎంటర్టైనింగ్ గా సాగడం ‘రాజా ది గ్రేట్’లో చెప్పుకోదగ్గ హైలైట్లు. హీరో అంధుడు కదా అని మొహమాటానికి కూడా ఆ పాత్ర చుట్టూ ఒక్క సెంటిమెంటు సీనూ పెట్టలేదు అనిల్ రావిపూడి. పైగా అంధత్వాన్ని కూడా కామెడీకే వాడుకున్నాడు. ఉదాహరణకు బ్యాంకులో హీరో తన టీంతో కలిసి దొంగతనం చేయించే సీన్ ఉంటుంది. ఆ సీన్లో లాజిక్ సంగతలా వదిలేస్తే.. బ్యాంకు మేనేజర్ ఏం అడిగినా ‘ఏమో సార్ నాకు కనబడదు’ అంటూ ఒకటే డైలాగ్ రిపీట్ చేస్తుంటాడు హీరో. అది కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే హీరో విలన్ కు సవాలు విసురుతూ.. ‘‘నా ముందుకొచ్చి వినబడు’’ అంటాడు. ఇలాంటి చమక్కులు అలరిస్తాయి. రవితేజ-శ్రీనివాసరెడ్డి కాంబినేషన్లో నడిచే ‘ముఖచిత్రం’ థ్రెడ్ కూడా హిలేరియస్ గా పేలింది. ఇలా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశాల్ని పొందికగా స్క్రిప్టులో గుది గుచ్చాడు అనిల్.

‘రాజా ది గ్రేట్’కు ప్రధాన ఆకర్షణ ప్రథమార్ధమే. హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యే కబడ్డీ  మ్యాచ్ ఎపిసోడ్ తో మొదలుపెడితే.. ప్రథమార్ధంలో వచ్చే అంశాలన్నీ అలరిస్తాయి. డార్జిలింగ్ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ కూడా సరదాగా సాగిపోతుంది. ఆరంభంలో మాస్ రాజా ఎంటర్టైన్మెంట్ అందిస్తే.. డార్జిలింగ్ ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాద్.. అన్నపూర్ణమ్మ.. పృథ్వీ లీడ్ తీసుకుని కొంతసేపు టైంపాస్ చేయిస్తారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది. బ్లైండ్ హీరోతో అలాంటి ఫైట్ చేయించడం కొంత ఇల్లాజికల్ గా అనిపించినా.. ఆ సీన్లో హీరోయిజానికి మాత్రం ఢోకా లేదు.

ఐతే ప్రథమార్ధంలో రయ్యిన దూసుకెళ్లే ‘రాజా ది గ్రేట్’కు ద్వితీయార్ధంలో బ్రేకులు పడిపోతాయి. సెకండాఫ్ లో చెప్పుకోవడానికి కథ కానీ.. చెప్పుకోదగ్గ మలుపులు కానీ ఏమీ లేవు. కామెడీ కొంచెం వర్కవుటైనా.. కథ పెద్దగా ముందుకు కదలదు. కొన్ని సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. ఒక సీన్లో సినిమా ముగిసినట్లే ముగిసి.. మళ్లీ ఒక పాట.. పతాక సన్నివేశం అంటూ రెండోసారి ముగుస్తుంది. ప్రథమార్ధంలో సినిమాపై కలిగిన ఇంప్రెషన్ ను ద్వితీయార్ధం కొంత తగ్గిస్తుంది. ముందే చెప్పుకున్నట్లు కంటెంట్ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. హీరోను అంధుడిగా పెట్టి కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగే దీన్నీ నడిపించారు. యాక్షన్ ఎపిసోడ్ల విషయంలో మరీ ఎక్కువ లిబర్టీ తీసుకున్నారు. ఐతే ఈ లోపాల్ని మరిపించే ఎంటర్టైన్మెంట్ కు ‘రాజా ది గ్రేట్’లో ఢోకా లేదు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఛాయిసే.

నటీనటులు:

‘రాజా ది గ్రేట్’ చూశాక మాస్ రాజా ఈజ్ బ్యాక్ అనకుండా ఉండలేం. మధ్యలో గ్యాప్ వచ్చినా.. చేస్తున్నది అంధుడి పాత్ర అయినా రవితేజ ఊపేమీ తగ్గలేదు. రాజా పాత్రను అవలీలగా.. తనదైన శైలిలో చేసుకెళ్లిపోయాడు రవితేజ. లుక్ కొంచెం తేడా కొట్టినట్లు అనిపించినా.. రవితేజ ఎనర్జీ మాత్రం తగ్గలేదు. రవితేజ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటి అని చెప్పొచ్చు. కాకపోతే రవితేజ కొన్నిచోట్ల అవసరానికి మించి కాన్ఫిడెన్స్.. ఉత్సాహం చూపించేశాడనిపిస్తుంది. హీరో అంధుడనే విషయమే మనం మరిచిపోతాం అక్కడక్కడా. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఓకే కానీ.. ‘మహానుభావుడు’లో ఉన్నంత అందంగా ఇందులో లేదు. ఆమె నటన సాధారణంగా అనిపిస్తుంది. పాత్రకు తగ్గట్లు హావభావాలు పలికించలేకపోయింది. నటనకు అవకాశమున్న పాత్రే అయినా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. రాధిక చిన్న పాత్రలోనే బాగా చేసింది. విలన్ వివేన భాటేనా తెలుగు సినిమాల్లో మనకు అలవాటైన విలన్ పాత్రలో పర్వాలేదనిపించాడు. రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాసరెడ్డి పృథ్వీ బాగానే నవ్వించారు. తనికెళ్ల భరణి కూడా ఎంటర్టైన్ చేశాడు. సంపత్.. ప్రకాష్ రాజ్.. సాయికుమార్ మామూలే.

సాంకేతిక వర్గం:

సాయికార్తీక్ సంగీతం యావరేజ్ గా అనిపిస్తుంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతావి మామూలే. ఐతే సాయికార్తీక్ నేపథ్య సంగీతం వరకు మెప్పించాడు. హీరో క్యారెక్టర్ థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మోహనకృష్ణ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం బాగుున్నాయి. డార్జిలింగ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు బాగా తీశారు. నిర్మాణ విలువలు దిల్ రాజు బేనర్ స్థాయికి తగ్గట్లే బాగున్నాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన స్ట్రెంత్ ఏంటో చూపించాడు. ఎంటర్టైన్మెంట్ విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంధుడి పాత్రను ఇంత వినోదాత్మకంగా చూపించినందుకు అభినందించాల్సిందే. చాలా చోట్ల లాజిక్ గురించి పట్టించుకోకపోయినా.. కామెడీ పండించడంలో మాత్రం దర్శకుడు విజయవంతమయ్యాడు. అతడి సంభాషణలు కూడా బాగున్నాయి. రేసీగా సాగిపోయేలా స్క్రీన్ ప్లేను తీర్చిదిద్దుకున్నాడు అనిల్. కాకపోతే కథ విషయంలో మాత్రం ఏ కొత్తదనం చూపించలేకపోయాడు. ద్వితీయార్ధాన్ని ఇంకొంత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాల్సింది. ఓవరాల్ గా అయితే అనిల్ కు మంచి మార్కులే పడతాయి.

చివరగా: రాజా.. ది (రొటీన్) ఎంటర్టైనర్!

రేటింగ్- 3.1/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre