బాహుబలి మలి భాగంలో అందరి దృష్టిని ఆకర్షించే సీన్ ఒకటి ఉంటుంది. ఏనుగు తొండం మీద కాలు పెట్టి.. దాని మీదకు ఎక్కే ప్రభాస్.. విల్లును సంధిస్తాడు. సినిమాలోనూ ఈ సీన్ ను గ్రాఫిక్స్ చేశారు. హైదరాబాద్ కు చెందిన కంపెనీనే ఈ సీన్ కు సీజీ వర్క్ చేసింది. మరి.. ఆ సినిమా ఎఫెక్టో లేక సొంత పైత్యమో కానీ ఒక వ్యక్తి అదే తీరులో ప్రయత్నించి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఉదంతాన్ని అతని స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ చేయటంతో ఇది వైరల్ గా మారింది.

కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కరిమన్నూరులో ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్లే క్రమంలో ఒంటరిగా ఉన్న ఏనుగును చూశాడు.  రబ్బర్ ఎస్టేట్ ఆకులు తింటూ ఏనుగు కనిపించింది. ఫ్రెండ్స్ ఇద్దరు బండిని ఆపి.. ఏనుగు దగ్గరకు వెళ్లాడు.  ఏనుగు దగ్గరగా వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టాలనుకున్న అతగాడు గజరాజు దగ్గరకు వెళ్లాడు.

తన దగ్గరున్న అరటిపండ్లు పెట్టి మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. అతడి దగ్గరున్న పండ్లను ఏనుగుకు తినిపించాడు. ఏనుగుకు ముద్దు పెట్టాడు. అయినప్పటికీ ఏనుగు ఏమీ అనలేదు. దీంతో ధైర్యం వచ్చిందో ఏమో కానీ ఏనుగు తొండం మీద నుంచి ఎక్కే ప్రయత్నం చేశాడు. అంతే.. ఏమనుకుందో ఏమో కానీ ఏనుగు తన తొండంతో ఒక్క షాట్ ఇచ్చింది. దీంతో.. అల్లంత దూరాన పడ్డాడు. ఈ వీడియోలో.. ఏనుగు తొండం మీద ఎక్కాలన్న ఆలోచనను గుర్తించిన స్నేహితుడు వారిస్తూనే ఉన్నాడు. గజరాజు దెబ్బకు పడిన అతడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు చెబుతున్నారు.